Narayanarao by Adivi Bapiraju |
1930లలో విశ్వనాథ వారి వేయిపడగలతో పోటీ పడి ఆంధ్ర విశ్వకళాపరిషత్ వారి బహుమానాన్ని అందుకుందంటే 'నారాయణరావు' ఆషామాషీ నవల కాదన్న దృష్టి లో ఉంచుకుని చదివాను. అడివి బాపిరాజు గారు భావుకులు, వారి రచనాశైలి వారి యొక్క బహుముఖప్రజ్ఞను, సునిశిత మేధాసంపత్తిని ప్రతిబింబిస్తుంది. వారి నవలలన్నిటిలోకి నారాయణరావు పేరెన్నిక గాంచినది. ఇది 1920ల లో నడుచు కాల్పనిక కథ.
కథాపరంగా అంత కాఠిన్యమేమీ లేదు. తూర్పు గోదావరి జిల్లా కొత్తపేట వాస్తవ్యుడైన నారాయణరావు, తానూ పెళ్లి చేసుకున్న, చెప్పుడు మాటల మాయ లో పడి తనని ద్వేషించే భార్య శారద మనస్సు గెల్చుకోవడమే ప్రధాన కథ అని భావించాలి. అయితే, కేవలం ఒక విషయం తో వదిలివేస్తే, ఇదేమంత గొప్ప నవల అయ్యుండేది కాదు. రచయిత నవల లో సందర్భాన్ని ఉపయోగించుకుని, నారాయణరావు తన మిత్రుల తో కలిసి ఉత్తర భారత దేశ యాత్ర చేయడం, అచ్చటి క్షేత్రాలు, పర్యాటక కేంద్రాలను చాల చక్కగా వర్ణించడం అద్భుతం. నారాయణరావు, వారి మిత్రుల, బంధువుల పాత్రల ద్వారా ప్రేమ అనే భావనకు పెళ్లి అనే వ్యవస్థీకృత సాంప్రదాయానికి జరిగే చక్కటి సంఘర్షణ అద్భుతంగ చెప్పారు. నాయకుని మిత్ర బృందం లో చెన్నై కి చెందిన శ్యామసుందరి, ఆమె చెల్లెళ్ళ పాత్రలు కుడా చాలా ఉదాత్తంగా చిత్రీకరించారు. పూర్వపు సాంప్రదాయాలు, తెలుగునాట లలిత కళలు కూడా సందర్భానుసారంగా చక్కగా వర్ణించారు.
అయితే, బహుశా వేయిపడగలు చదివిన వెంటనే ఈ నవల చదివిన కారణంగా ఏదో కొంత వెలితి చెందాను - తెలియకుండానే కొంత పోలికలు చేయాల్స వచ్చింది. ఆయనను, ఇది తెలుగువారందరూ తప్పక చదవాల్సిన మంచి నవల!
Telugu Novel - నారాయణరావు by అడివి బాపిరాజు (1934), Emesco Publications