Search This Blog

Sunday, January 17, 2021

అనంతమై, అజరామరమై నిలిచిన వేయిపడగలు కు వందనాలు


"శిల్పం నిప్పులు త్రొక్కిన కోతి వంటిది కాదు, మదించిన ఏనుగు వంటిది. ఉన్మాదమెక్కిన కొలది ఠీవి ఎక్కువ. నిదానమెక్కువ. శక్తి ఎక్కువ"               - వేయిపడగలు (అధ్య.-15, పేజీ - 408)  

Transl' - An art form is not like a Monkey that stepped on fire. Rather, it's a War Elephant. The more depth it permeates, the more stable, powerful and proud it gets.

 
కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వ్రాసిన 'వేయిపడగలు' మహద్గ్రంధాన్ని చదివాను. బహుశా, ముందు ముందు పారాయణ లెక్క ఇంకా చాలా సార్లు చదువుతానేమో. ఒక మహాకావ్యాన్ని  చదివినంత సేపు కలిగే భావన వేరు, కానీ అట్టి కావ్యాన్ని గురించి తర్కించి, విమర్శ చేయుట వేరు. సరిగ్గా, ఇదే కష్టం నవలా నాయకుడైన ధర్మారావు గారికి వచ్చింది (అధ్య.-8, పేజీ - 207). 1939 లో ఏదో పోటీ కోసమై కవి సామ్రాట్ వారు ఈ గ్రంధాన్ని కేవలం 29 రోజులలో 999 పుటాలు గా, 36 అధ్యాయాలుగా గా dictate చేసారు. 

అసలేమిటి ఈ వేయిపడగలు?

అనగా అనగా, సుబ్బన్నపేట అనే ఒక గ్రామము (కృష్ణా జిల్లాలో ఒక ఊహాజనిత గ్రామం) - 18/19 వ శతాబ్దాల లో ఆ గ్రామం ఏర్పడుట, అచట వెలసిన నాగేశ్వర, సుభ్రహ్మణ్యేశ్వర మరియు వేణుగోపాలస్వామి దేవాలయాలు - ఇలా మొదలవుతుంది కథ. స్వామీ (దేవుడు), జమీందారు (ప్రతినిధి), బ్రాహ్మణుడు - దివాన్ (ప్రచారకులు), గణాచారి (వ్యాఖ్యాతలు), ప్రజలు - ఇలా అందరి తో నాలుగు స్థంబాల ధర్మ మంటపం గా విరజుల్లుతుంది ఈ గ్రామం. కొన్ని తరాల తర్వాత దివాన్ గారి వంశానికి చెందిన ధర్మారావు ప్రధాన పాత్రధారి నాయకునిగా చెప్పవచ్చు - సాంప్రదాయాన్ని, నూత్న పద్ధతులని అతను పోల్చడం తోనే చాలా కదా నడుస్తుంది. నూత్న విధానాలు, స్వార్ధం తో ధర్మానికి, పూర్వపు ఆచారాలకు తిలోదకాలిచ్చి ఆ వేయిపడగలు రెండు పడగలై, ఇంకా చివరకు మిగిలినది ఏమిటని మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేస్తుంది వేయిపడగలు.

నిత్యం పాములు, పక్షులు తో తిరిగే పసిరిక,  గురువు కి  శిష్యుడైన కుమారస్వామి, దయాగుణయుడైన జమీందారు, భగవంతుని లో ఏకమైన  గొప్ప భక్తురాలు గిరిక - అసలు ఈ గ్రంధమున వున్న అన్ని పాత్రలు విశదీకరించడం కష్టం. కవి సామ్రాట్ వారు ఎక్కడ కూడా ఎవ్వరిని తక్కువ చెయ్యలేదు - వచ్చి పోయే బ్రిటిష్ వారైన ఈట్సన్ దొర, గార్దినేర్ దొరల పాత్రలు కూడా ఎంతో ఉన్నతంగా తీర్చిదిద్దినట్టు ఉంటాయి. ఈ గ్రంధాన్ని ఒక ఆసరాగా చేసుకుని, అవకాశం గా భావించి, కొన్ని కొన్ని అధ్యాయాల లో కవి సామ్రాట్ వారు తెలుగు సంస్కృతి, సాహిత్యం, లలిత కళలు, - ఇలాంటి అనేక  విషయాల పై సమగ్రమైన విశ్లేషణ చేశారు. స్వార్ధపూరితమైన, అడ్డగోలు గా జరిగే అభివృద్ధి వల్ల జరిగే అనర్ధాలు (గుండేటి వాగు  వరదలు) చక్కగా విశదీకరించారు. అయితే, ఈ గ్రంధం పై చాలా విమర్శలు వున్నాయి. నాకంత  స్థాయి లేకపోయిన వాటికి సమాధానమిచ్చే ప్రయత్నమ చేతును -  

1. ఇది వట్టి గ్రాంధిక భాషయందున్నది కావున చదవడం కష్టం? - కానే కాదు, అర్ధం అవుతుంది. కానీ కొన్ని చోట్ల కష్టమే. ఇటీవల ఆంగ్లానువాదం కుడా అయ్యింది.
2. ఇది వట్టి చాదస్తపు పుస్తకం. రచయత modernity ని విమర్శిస్తూ, సాంప్రదాయాన్ని పొగుడుతూ, కొన్ని సాంఘిక దురాచారాలని కాపాడే ప్రయత్నం చేశారు? - ఎంత మాత్రము కాదు. unbridled & cause లేకొండగా ఎక్కడా modernity ని విమర్శించలేదు. అయితే, గ్రంధం రాసిన సమయం, సందర్భం, దేశకాల పరిస్థితులను దృష్టి లో పెట్టుకోవాలి. గ్రంధం చదవకుండా, చెప్పుడు మాటలు విని, విమర్శించడం సరి కాదు గా!

ఎవరు ఎమన్నా ,  ఏది ఏమైనా - Tolstoy, Proust, Joyce, Dickens, Marquez సరసన విశ్వనాథ వారు నిలిచే వుంటారు, అనంతమై, అజరామరమై నిలిచిన వేయిపడగలు కు నా వందనాలు!

 

Book - Veyipadagalu by Kavi Samrat Viswanatha Satyanarayana (Telugu)

 

Maheeth Veluvali,                                                         
16 Saladi Jamindar Street,
Palakollu         
Sunday - 17th of January, 2021.

No comments:

Post a Comment