Search This Blog

Friday, June 11, 2021

భారతీయ కోణం లో తీయనాన్మెన్ స్క్వేర్

 

ది హిందూ దినపత్రిక లో చైనా గురించి భారత మాజీ విదేశీ వ్యవహారాల కార్యదర్శి విజయ గోఖలే సర్ వ్రాసిన పలు వ్యాసాలు చదివి నేను వారికి అభిమాని గా మారాను. 2017 డోక్లామ్ వివాదం అప్పుడు నిప్పులు చెరుగుతున్న చైనా విదేశీ వ్యవహారాల మంత్రి వాంగ్ యి కి చిద్విలాసం గా చిరునవ్వులు చిందిస్తూ షేక్హ్యాండ్ ఇస్తున్న విజయ్ గోఖలే గారి ఫోటో ఇప్పటికే చాలా మందికి తెలుసు. అమెజాన్ వెబ్సైటు లో వారి పేరు మీద ఈ పుస్తకం చూసినవెంటనే చదవాలనిపించింది. వారు వ్రాసిన మొదటి పుస్తకం ఇది. ప్రపంచంలో గౌరవించదగ్గ చైనా ఎక్స్పర్ట్స్ లో వారు ఒకరు. సరిహద్దు లో గొడవలు జరిగినప్పుడు జాతీయవాద భావనలు పొందడం తప్పితే, భారతీయుల లో, చైనా యొక్క రాజకీయ, ఆర్ధిక వ్యవస్థల గురించి అవగాహన తక్కువ అని రచయిత ముందుమాట లో పొందుపర్చడం నిర్వివాదాంశం.

ఇక, పుస్తకం లో విషయానికి వస్తే, చైనా ని, ప్రపంచాన్ని షాక్ కి గురిచేసిన 3-4 జూన్ 1989 నాటి తీయనాన్మెన్ స్క్వేర్  ఉదంతం అసలు ఎందుకు జరిగింది? అట్టి ఉదంతం లో కీలక పాత్ర పోషించిన వ్యక్తులు, విశేషాల గురించి చక్కని విశ్లేషణే సారాంశం. పుస్తకం చిన్నదైనా , 80 వ దశాబ్దపు చైనా ని పాశ్చాత్య దేశాలు, ప్రపంచ మీడియా ఎంత తప్పుగా గా అంచనా వేశాయో చక్కగా వర్ణించారు. బీజింగ్ నగరం లో అవెన్యూ అఫ్  ఎటర్నల్ పీస్ వంటి పలు వీధులు, కూడళ్ల వర్ణన ఎంత ఉన్నతంగా ఉంది అంటే, కేవలం పాలకొల్లు లో మా ఇంట్లో కూర్చుని, 80ల నాటి డెంగ్ జావోపింగ్ గారి రాజకీయ చతురతని ప్రత్యక్షంగా వీక్షించినట్టు గా వుంది.    

బూర్జువా లిబెరలిస్ం పేరు తొ తిరుగుబాటు చేయదలచిన ఒక విద్యార్థి ఉద్యమాన్ని ఏక పార్టీ దేశమైన చైనా నిర్దాక్షిణ్యంగా అణచివేసింది - ఇది పైకి ప్రపంచానికి తెలిసిన విషయమైనా, అసలు 1989 నాటి సంఘటనలు కేవలం చైనీస్ కమ్మూనిస్టు పార్టీ లో కొంత మంది వ్యక్తుల మధ్య జరిగిన power struggle కి అడ్డం పట్టాయని వివరించిన తీరు తో ఏకీభవించాలి. ముఖ్యంగా ఆఖరి చాఫ్టర్ 'డబ్లింగ్ డౌన్' లో డెంగ్ నాయకత్వం లో చైనా, పాశ్చాత్య దేశాల కళ్ళు కప్పి, ఎలా అభివృద్ధి పధం లోకి దూసుకుపోయిందో విశదీకరించిన తీరు అద్భుతం. రాజకీయ సంస్కరణ, వ్యక్తి స్వేచ్ఛ లేకొండా, ఆర్ధిక అభివృద్ధి ని సుస్థిరపర్చడం గొప్ప విశేషమే! జార్జి ఆర్వెల్ వ్రాసిన 1984 గుర్తుకి వచ్చింది.

మొత్తంగా, ఈ పుస్తకం చాలా బాగా నచ్చింది - బహుశా, కొన్ని భాషల లోకి తర్జమా కూడా అవ్వవొచ్చు. మన అందరికి చైనా గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా వుంది - గాడీఫాథర్ లో మైకేల్ కార్లాయోనే అన్నట్టు - 'Keep your friends close and your enemies closer'. 

 

Book (English) - Tiananmen Square - The Making of a Protest - A Diplomat looks back by Vijay Gokhale (Harper Collins India)
 
Maheeth Veluvali, 
Friday, 11th of June, 2021,. 
16 Saladi Jamindar Street, Palakollu,.    

No comments:

Post a Comment